"దివ్య ఖుర్ఆన్ సందేశం" కు స్వాగతం

((అల్’హమ్దు లిల్లాహి రబ్బిల్ ’ఆలమీన్, అల్ ఖాఇ‘లు ఫి కితాబిహిల్ కరీమ్))

“సమస్త స్తోత్రాలకు అర్హుడు అల్లాహుతా’ఆలా మాత్రమే. ఆయన తన గ్రంథంలో అన్నాడు”:

((ఖద్ జాఅ‘కుమ్ మిన్ అల్లాహి నూరున్ వ కితాబున్ ముబీన్.))

“వాస్తవంగా మీ కొరకు అల్లాహ్ తరఫు నుండి ఒక జ్యోతి (దైవ ప్రవక్త స.అ.స.)మరియు ఒక స్పష్టమైన గ్రంథం (ఖుర్ఆన్) వచ్చి వున్నది.”సూరహ్ అల్-మాఇ‘దహ్, 5:15

ప్రపంచంలో ఈ నాడు ఉన్న దివ్య గ్రంథాలలో -1430 సంవత్సరాలు గడిచినపోయిన తరువాత కూడా - ఒక్క అక్షరపు మార్పు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా భద్రపరచబడిన దివ్య గ్రంథం కేవలం ఖుర్ఆన్ మాత్రమే. దీనిని పునరుత్థాన దినంవరకు ఇలాగే భద్రపరుస్తానని, అల్లాహ్ (సు.తా.) తన గ్రంథంలో సూచించాడు. చూడండి ఖుర్ఆన్, సూరహ్ అల్-హిజ్ర్, 15:9.

((ఇన్నా న’హ్ను న’జ్జల్నజ్జి‘క్ర వ ఇన్నా లహు ల’హాఫి’జూన్))

“నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్)ను అవతరింపజేసినవారము మరియు నిశ్చయంగా, మేమే దీనిని కాపాడేవారము.”

మహా ప్రవక్త (సఅస) అన్నారు:

((బల్లి’గూ ’అన్ని వలవ్ ఆయహ))

“ఒక్క ఆయత్ అయినా సరే, నా తరఫు నుండి వచ్చింది, (ప్రజలకు) అందజేయండి.”

అంటే అల్లాహుతా’ఆలా సందేశాన్ని ప్రజలకు అందజేయటం, కేవలం విద్వాంసుల (ఉలమాల) బాధ్యత మాత్రమే కాదన్నమాట. అల్లాహుతా’ఆలా సందేశాన్ని, తనకు తెలిసినంతమట్టుకు, ప్రజలకు అందజేయటం ప్రతి ముస్లిం భాధ్యత! అల్లాహుతా’ఆలా పంపిన ప్రవక్తలలో, ము’హమ్మద్ (’స’అస) చిట్టచివరి ప్రవక్త కాబట్టి అతని పై అవతరింపజేయబడిన ఖుర్ఆన్ అంతిమ దివ్యగ్రంథం. కాబట్టీ దాని సందేశాన్ని సర్వ లోకాలవారికి అందజేయడం ప్రతి ముస్లిం విధి. చూడండి ఖుర్ఆన్, సూరహ్ అల్-’అ’స్ర్, 103:3.
((ఇల్లల్లజీ‘నఆమనూ వ ’అమిలు’స్సాలిహాతి వతవా’సవ్ బిల్హఖ్ఖి వతవా’సవ్ బి’స్సబ్రి!))

“విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునేవారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునేవారు తప్ప!”

కాబట్టి కలకాల స్వర్గసుఖాలను పొందాలని అపేక్షించే ప్రతి ముస్లిం అల్లాహుతా’ఆలా సందేశాన్ని-తనకు తెలిసినంత మట్టుకు - ఇతరులకు అందజేస్తూ ఉండాలి.

ధర్మవేత్తల అభిప్రాయంలో, దివ్యఖుర్ఆన్ భావామృతాన్ని- ఉన్నది ఉన్నట్లుగా - ఇతర భాషలలోకి అనువదించడం సాధ్యమైనపనికాదు.ఎందుకంటేఖుర్ఆన్ లోని ఎన్నో ఆయాత్ ఒకటి కంటే ఎక్కువ సరైన భావం ఇస్తాయి. అనువాదంలో ఒక ఆయత్ యొక్క ఒకే ఒక్క భావాన్ని మాత్రమే వ్యక్తపరచడం జరుగుతుంది. మరొక విషయమేమిటంటే, కేవలం శబ్దానువాదం చేస్తే, ఆ శబ్దపు మూల భావం ఇవ్వక పోవడంవల్ల అనర్థం కావచ్చు. కాబట్టి దివ్యఖుర్ఆన్ ను అనువాదించేటప్పుడు, అహాదీసుల వెలుగులో శబ్దపు మూలభావం ఇవ్వటం చాలా ముఖ్యం. అరబ్బీ భాష నేర్చుకొని, ఖుర్ఆన్ ను అర్థం చేసుకోగలిగితే ఎంతో ఉత్తమం. కాని అది అందరికీ సాధ్యమైన పని కాదు. అరబ్బీ మాతృభాష ఉన్నవారు కూడా - వ్యాఖ్యానాల సహాయం లేకుండా -ఖుర్ఆన్ ను చదివి అర్థం చేసుకోకపోవచ్చు.

అయినప్పటికీ అహాదీసుల వెలుగులో చేసిన ఖుర్ఆన్ యొక్క అనువాదాలు చదివి, అల్లాహుతా’ఆలాయొక్క సందేశాన్ని అర్థం చేసుకొని, దానిపై నడిచి, ఒకడు తనను తాను శాశ్విత నరకాగ్ని నుండి కాపాడుకోవచ్చు. అందుకే ముస్లిం ధర్మవేత్తలు, ఖుర్ఆన్ యొక్క అనువాదాలకు అంగీకరించారు. దీనివల్ల అల్లాహుతా’ఆలాయొక్క అంతిమ సందేశాన్ని సర్వలోకాలవారికి అందజేయవచ్చు. ఇది ప్రతి ముస్లిం యొక్క విద్యుక్త ధర్మం.

కాబట్టి మేము, మాకు వీలైనంతవరకు, సులభమైన భాషలో ఖుర్ఆన్ భావాన్ని, “దివ్యఖుర్ఆన్ సందేశం” పేరుతో అనువదించాము. అల్లాహుతా’ఆలా మా కృషిని అంగీకరించుగాక!

ఈ దివ్యఖుర్ఆన్ సందేశం PDF లో 1. www.qurancomplex.org , 2. www.islamhouse.com, 3.www.understandquran.com వెబ్ సైటుల మీద కూడా ఉంది. ఎవ్వరైనా దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

డా. అబ్దుల్ రహీమ్ మౌలానా
అనువాదకుడు, “దివ్యఖుర్ఆన్ సందేశం”
అధ్యక్షుడు, అల్-ఫలఖ్ ఎజుకేషనల్ &చారిటబుల్ ట్రస్ట్ (AFECT)

ఈ“దివ్యఖుర్ఆన్ సందేశం” యొక్క అనువాదపు కొన్ని ముఖ్య విశేషాలు:

  • ఈ అనువాదపు ముఖ్య విశేషమేమిటంటే ఇంతవరకు చేయబడిన తెలుగు అనువాదాలకు భిన్నంగా ఈ అనువాదం - ఉర్దూ అనువాదంనుండి కాక - అరబ్బీ నుండి సూటిగా తెలుగులోకి చేయబడింది.
  • ఈ అనువాదాన్ని ఐదుగురు విద్వాంసులు పునర్విమర్శన చేశారు.
  • ఈ అనువాదాన్ని కింగ్ ఫహద్ ఖుర్ఆన్ ప్రింటింగ్ కాంప్లెక్స్ మదీనా మునవ్వరా వారు - పూర్తిగా విమర్శించిన తరువాత - ప్రచురించారు.
  • ప్రతి అరబ్బీ పదానికి ఒక భిన్న తెలుగు పదం వాడబడింది. ప్రతి అరబ్బీ పదం అనువదింపబడింది. ఇతర అనువాదాలవలే ఒకే తెలుగు పదాన్నివిభిన్న అరబ్బీ పదాలకు బదులుగా వాదకుండా జాగ్రత్త తీసుకోబడింది.
  • అల్లాహ్(الله(అనే పదం అదే రూపంలో వాడబడింది. అల్లాహ్ (సు.తా.)కు బదులుగా సర్వనామం (Pronoun) వాడుకలో వచ్చినప్పుడు కేవలం, ‘ఆయన’అనే పదం వాదబడింది. ప్రవక్తలకు మరియు దైవదూతలు (’అలైహిమ్ స.) లకు ‘అతను’; మరియు ఇతరులకు ‘అతడు’/ ‘వాడు’ అనే పదాలు వాడబడ్డాయి.
  • వీలైనంతవరకు, స్త్రీ పురుష లింగములు, ఏక, ద్వితీయ, బహువచనాలు; ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషానుక్రమాలు మొదలైన వ్యాకరణ విషయాలుసరిగ్గావాడబడ్డాయి.
  • ఇతర వివరాలకు Foreword (తోలిపలుకు) చూడండి.
ఖుర్ఆన్ రిలీజ్ ఫోటో గ్యల్లెరీ
ఖుర్ఆన్ రిలీజ్ వీడియో గ్యల్లెరీAL-FALAQ (SHANTHI KIRANALU) Educational & Charitable Trust   Registered Charity, H.No. 2-6-7/MAK/A/506, Upperpally, Rajendernagar, Hyderabad- 500028, A.P.
Ph: +91-9652468568, Saudi Arabia +966 503529194   Email: telquran@gmail.com, info@telugu-quran.com